కవ్వాల్‌లో పులుల కదలికలు!

 ఆదిలాబాద్‌ : జిల్లాలో పులులు సంచరిస్తున్నాయి. ఆదిలాబాద్‌ శివారు మండలాల్లో గత కొద్ది రోజులుగా పులుల సంచారంపై అలజడి నెలకొన్నా పక్కా ఆధారాలు లభించలేదు. కాని మంగళవారం రాత్రి పులి జైనథ్‌ మండలం నిరాల వద్ద అంతర్రాష్ట్ర రహదారి దాటుతుండగా రోడ్డుపై కారులో వెళ్తున్న వ్యక్తి సెల్‌ఫోన్‌ ద్వారా ఫొటో తీయడంతో ఇప్పుడు పులులు తిరుగుతున్నాయనేది నిజమైంది. అయితే తాంసి, భీంపూర్‌ మండలాల్లో సంచరించిన పులుల్లో ఇది ఒకటా..! లేదా మరోటా? అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఏదేమైనా పులుల సంచారంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.


సురక్షిత వన ప్రాంతం కోసం వెతుకులాడుతున్న పులులు మధ్యలో ఆదిలాబాద్‌ శివారు మండలాల్లోని జనవాసాల్లోంచి వెళ్తున్నాయి. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్‌ అభయారణ్యం నుంచి బయటకు వస్తున్న పులులు పెన్‌గంగ నది దాటి వచ్చి ఆవాసం ఏర్పర్చుకునేందుకు అడుగులు వేస్తూ చుట్టుపక్కల మండలాల్లోని గ్రామాలు, పంట పొలాలు, రోడ్లు దాటుతూ వెళ్తున్నాయి. బేల మండలం అవాల్‌పూర్‌కు చెందిన కె.అనిల్‌ అవాల్‌పూర్‌ నుంచి ఆదిలాబాద్‌కు మంగళవారం రాత్రి కారులో వస్తుండగా నిరాల వద్ద రాత్రి 10.40 గంటలకు పులి రోడ్డు దాటుతున్నప్పుడు తన సెల్‌ఫోన్‌ ద్వారా ఫొటో తీశాడు. ఆ తర్వాత కొద్ది దూరంలోని లక్ష్మీపూర్‌ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ వద్ద నీళ్లు తాగి వెళ్లినట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగింది.