గిరిజా క్షమించు.. అమృత అమ్మ దగ్గరకు రా

హైదరాబాద్‌ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు ఆత్మహత్య కేసులో కొత్త అనుమానాలు వ్యక‍్తం అవుతున్నాయి. మారుతీరావు ఇటీవలే వీలునామా మార్చడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అమృత భర్త ప్రణయ్‌ హత్యకు ముందే మారుతీరావు తన ఆస్తిని మొత్తం సోదరుడి పేరున వీలునామా రాశారు. అయితే ఇటీవలే వీలునామా నుంచి సోదరుడి పేరు తీసేసి ..తిరగరాశారు. కాగా జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మారుతీరావు తన కుమార్తె అమృతతో సయోధ్యకు ప్రయత్నిస్తున్నారు. (అమృతా ప్రణయ్ తండ్రి ఆత్మహత్య..!)




అయితే రెండు రోజుల క్రితం మారుతీరావుతో బంధువులు, సోదరులు గొడవ పడినట్లు తెలుస్తోంది. అతడి వల్ల తమ కుటుంబం పరువు పోయిందని వారు ఘర్షణ పడినట్లు సమాచారం. మారుతీరావు వల్ల తమ కొడుకులకు వివాహాలు కావడం లేదని, ఎవరూ పిల్లను ఇవ్వడానికి ఎవరూ ముందు రావడం లేదని గొడవ పడినట్లు భోగట్టా. ఓ వైపు కుటుంబ సభ్యులతో వివాదాలు, మరోవైపు ప్రణయ్‌ హత్యకేసు విచారణ చివరి దశకు రావడంతో  తీవ్ర మనస్తాపం చెందినట్లు తెలుస్తుంది. సూసైడ్‌ నోటులో ‘గిరిజా క్షమించు... అమృత అమ్మ దగ్గరకు రా’  అని రాశారు. ఆ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. (మారుతీరావు సూసైడ్ నోట్ నోట్లో.. )